Saturday, November 26, 2011

చివరికి మిగిలేది

ఏం మిగిలింది నేస్తం చివరికి,
కనులు చెమర్చే జ్ఞాపకాలు తప్ప?
నీ ఒంటరి తలుపుల్లో,
ఎడారి నిట్టూర్పుల్లో,
నీ గోడు నీకే తెలియని
కడు శోచనీయ స్థితిలో,
నీ తల్లి నీకు గుర్తుకు వచ్చిందా?
పల్లెటూరులో పొలాలు దున్నే పెత్తనం కంటే
పట్టణంలో కూలీతనమే నచ్చింది నీకు!
ఆ పల్లె పచ్చదనం,
తల్లి ఒడిలో వెచ్చదనం
పిలవడం లేదా నిన్ను?
ఆ వడి వడి పరుగుల్లో,
పొడి బారిన గుండె సడులలో,
నీవు మ్రొక్కిన రాములోరి గుడి,
ప్రక్కనే ఉన్న చిన్నప్పటి బడి
గుర్తుకు వచ్చాయా నీకు?
ఆ ఊరు చెప్పిన కతలు,
చిన్నప్పుడు కట్టిన జతలు
ఏనాడైనా నీ వెతలలో తలుచుకున్నావా?
నీ తల్లిని చూస్తావా,
ఆ పల్లెని పలకరిస్తావా,
కన్న తల్లి ఋణం తీర్చుకుంటావా?
ఏం మిగిలింది నేస్తం చివరికి,
కనులు చెమర్చే జ్ఞాపకాలు తప్ప?