Sunday, September 15, 2013

కుమారీ నామకరణం

మా కుమార్తె పేరుకు శక్తి స్వరూపిణి అని అర్ధం రావాలనుకున్నాము. ఈ విషయమై మహిషాసుర మర్దిని శ్తోత్రం మరియు లలితా సహస్ర నామాలు పరిశీలించాము. చివరికి, దేవతలకు వరాలనిచ్చే దేవత అని అర్ధం వచ్చే "సురవరవర్షిణి" అనే పేరు ఎంపిక చేసాము. "వర్షిణి" పదానికి ముందు మా అమ్మ పేరులోని "రత్న" అనే పదం కలిపి "రత్న వర్షిణి" అనే పేరు నిర్ణయించుకున్నాము.  అన్ని దేవుళ్ళనీ సంతృప్తిపరిచే ఆనవాయితీ మా ఇంట్లొ ఉండడం వల్ల, నామకరణం రోజున, "విశ్వ సత్య సాయి గీతా రత్న వర్షిణి" అని పేరు పెట్టాము. పొడుగైన పేరు అవడం వల్ల, స్కూలు రిజష్టర్లో మిగిలిన పేరు "వర్షిణి" మాత్రమే!                 

Friday, September 6, 2013

సంఘర్షణ

ఇది పది సంవత్సరాల క్రిందటి మాట. ఈ మధ్య కాలంలో తెలుగు వార్తా వాహినులల్లో వచ్చే వార్తలు చూస్తుంటే, గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి..

నాకు అత్యంత ఆప్తుడైన మిత్రుడి వివాహ వేడుకలకు మా ఊరి నుంచి బయలుదేరాను. ముందస్తు రిజర్వేషన్ లేకపొవడం వల్ల గోదావరి ఎక్స్ ప్రెస్స్ జనరల్ బోగీలో ఎక్కాను. నాతో పాటు తునిలో ఎక్కిన ఇతర ప్రయాణికులతో మాటల ముచ్చట్లలో నాకు అవగతమైన విషయం; వీరంతా వరంగల్ జిల్లా లోని కేసముద్రంలో వలస కూలీలు మరియు అతి చిన్న వ్యాపరస్తులు అని. "వీరంతా మరిన్ని అవకాశాల కోసం వలస పొతున్నారా లేక ఇక్కడ అవకాశాలే లేవా అని?" అనే ప్రశ్న నాతో ప్రయాణించింది. అడుగు కూడా కదపలేని అతి ఇరుకైన జనరల్ బోగీలో ప్రయాణం ఈ వలస పక్షులకి  సర్వ సాధారణం.

మరుసటి రోజు సూర్యోదయానికి చాలా ముందే, ఖాజీపేటలో రైలుబండి దిగి, నా గమ్యమైన ఎర్రబల్లి గ్రామానికి బయలుదేరాను. ఈ గ్రామం కరీం నగర్  జిల్లాలో, వరంగల్ జిల్లాకి అతి దగ్గరలో ఉంది. బస్సు ఎర్రబల్లి గ్రామానికి కొన్ని కి.మీ.ల దూరంలో బైపాస్ పై ఆగింది. అక్కడ నుండి ఊరికి వెళ్ళాలంటే వేరే బస్ గానీ, ఆటో గానీ ఏమీ ఉండవు; కాలి నడకన వెళ్ళవలసిందే. నేను బస్ దిగి, నెమ్మదిగా నడవసాగాను. ఆ ఎర్రమట్టి మార్గానికి రెండు వైపులా ఎరుపు రంగులో అనంతమైన  మట్టి ఎడారులు కనిపిస్తున్నాయి.  అప్పుడే,  ప్రభాతభానుడు ఎర్రని కిరణాలతో వెచ్చగా పలకరించసాగాడు. ఒక వైపు నేను, ఇంకో వైపు సూర్యుడూ, మరో రెండు వైపులా ఎర్రని మట్టి ఎడారులు వెరసి నాలుగు దిక్కులనూ ఎర్రగా ఆక్రమించాము. ఈ మట్టి ఎడారుల  ఎరుపు స్వార్థపరులూ, నిరంకుశులూ అయిన గత, ప్రస్తుత పాలకుల అలక్ష్యం, అసమర్ధతల నిదర్శనంగా నిలిచింది. ఈ మట్టి యొక్క ఎరుపు మరియు దాని వాసనలు ఈ ప్రజలలొ సామాజిక, ఆర్థిక విప్లవాల స్ఫూర్తిని నింపినట్టునాయి.
నెమ్మదిగా నడుచుకుంటూ గ్రామంలోని విడిదింటిలోనికి అడుగుబెట్టాను. నన్ను ఆ ఇంటి యజమాని సాదరంగా ఆహ్వానించారు. ఆయన నాతొ, "బాబూ, ఈ ఊరికి ఎలా వచ్చిండ్రు?" అని అడిగారు. నేను నడిచి వచ్చానన్న విషయం చెప్పాను. అంతకు ముందే నేను ఎక్కడ నుంచి వచ్చానో ఆయనకి తెలిసి ఉండడం వల్ల, ఆయన "ఆంధ్రా వాడు ఎంత తెలివిగా వచ్చిండ్రో, చూసిండ్రా?" అని తన ఇద్దరు కొడుకులని ఉద్దెశ్యించి అన్నారు.  మొదట, నేను చేసిన అంత తెలివైన పని ఎమిటొ అనేది నాకు అర్ధం కాలేదు. దాన్ని ప్రక్కన పెడితే, "నన్ను ఈ పెద్దాయన ఆంధ్రా వాడు అంటున్నాడు. వీళ్ళంతా ఎవరు!? మనమంతా ఆంధ్రప్రదేశ్ పౌరులమే కదా?" అనే ప్రశ్నలు నా మెదడుని దొలవసాగాయి. ఆయన ఇద్దరు కొడుకుల మెదడులలొ ఏం ప్రశ్నలున్నాయో మరి, వారి ముఖాల్లొ ఏ రకమైన భావమూ వ్యక్తమవలేదు.

కొన్నాళ్ళ తరువాత ఎంతో మంది నిరుద్యొగులలాగానే, నేను కూడా నా జీవన పోషణ నిమిత్తం హైదరాబాద్ మహానగరానికి పయనమయ్యాను. ఒక రోజు, కె.పి.హెచ్.బి. లో స్థిరనివాసముంటున్న ఒక మిత్రుడి ఇంటికి, ఇంకొందరి మిత్రులతో కలసి వెళ్ళాను. నేను ఎక్కడ నుంచి వచ్చానో తెలుసుకున్న మా మిత్రుడి నాన్నగారు, "మా ఆంధ్రోడివన్నమాట!" అన్నారు. ఇంకో మిత్రుడి పెళ్ళిలో కలిగిన ప్రశ్నలే మళ్ళీ నా మెదడుని దొలిచాయి. "ఎందుకు వీళ్ళంతా నన్ను పరాయి రాష్ట్రం నుంచి వచ్చిన వాడిలాగ చూస్తున్నారు?" అనే ప్రశ్నకు సమాధానం అప్పుడు నాకు అర్ధం కాలేదు.

నేను Embedded Systems Course లో జాయిన్ అయిన తరువాత, ఇంకో మిత్రున్ని కలవడానికి S.R. నగర్ వెళ్ళాను. అక్కడ రాత్రి భోజనానికి ఒక మెస్ కి వెళ్ళాము.  ఆ మెస్ పేరు, "శ్రీ  సాయి ఆంధ్రా భోజనశాల" అని ఉంది. నేను ఆ మిత్రుడితో, "మనమంతా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాం కదా, ఈ మెస్ పెరు శ్రీ  సాయి భోజనశాల అని కదా ఉండాలి?" అని అడిగాను. దానికి మావాడు పెట్టిన పెట్టిన ముఖభావం, "నీకు ఎందుకురా ఇవన్నీ?" అన్నట్టు ఉంది. ఆ ప్రశ్న సమకాలీన పరిస్థితులకు సరిగ్గా కుదురుతుందనుకుంటా. మాటల సందర్భంలో  ఆ మెస్ యజమాని మరియు సిబ్బంది నెల్లూరు జిల్లా నుంచి బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు అని తెలిసింది.  కేసముద్రానికి గానీ, హైదరాబాద్ కి గానీ వీళ్ళంతా, నా లాగే పొట్ట కూటి కొసం వలస వచ్చిన వాళ్ళే. వీరంతా సొంత ఊరిలొ ఆస్తుల తెగనమ్మి లేదా తాకట్టుపెట్టి, స్వీయకష్టంతొ ఈ ప్రాంతంలో తమ కలలను సాకారం చేసుకోవడానికి వచ్చిన వారు. తమ పొట్ట నిండిన తరువాత ఇంకొకడి పొట్ట నింపడానికి ప్రయత్నించేవారే తప్ప, ఎవరి పొట్టా కొట్టేవాళ్ళు కాదు.

స్థానిక ప్రజల రక్తంలో నిజాం కాలం నుండి ఉడుకుతున్న సామ్యవాద పోరాట భావానికీ, వలస ప్రజల రక్తంలో సహజంగా ఉన్న పెట్టుబడిదారీ భావానికి జరుగుతున్న సంఘర్షణ ఇది. ఈ సంఘర్షణ సరికొత్త భావజాలానికి నాంది పలకాలి. ఈ భావమే "సామ్యవాద పెట్టుబడిదారీ విధానం"(Socialistic Capitalism) అని పిలవబడాలి. హైదరాబాద్ మహానగరం ఈ భావానికి తార్కాణంగా నిలవాలి. 

Saturday, November 26, 2011

చివరికి మిగిలేది

ఏం మిగిలింది నేస్తం చివరికి,
కనులు చెమర్చే జ్ఞాపకాలు తప్ప?
నీ ఒంటరి తలుపుల్లో,
ఎడారి నిట్టూర్పుల్లో,
నీ గోడు నీకే తెలియని
కడు శోచనీయ స్థితిలో,
నీ తల్లి నీకు గుర్తుకు వచ్చిందా?
పల్లెటూరులో పొలాలు దున్నే పెత్తనం కంటే
పట్టణంలో కూలీతనమే నచ్చింది నీకు!
ఆ పల్లె పచ్చదనం,
తల్లి ఒడిలో వెచ్చదనం
పిలవడం లేదా నిన్ను?
ఆ వడి వడి పరుగుల్లో,
పొడి బారిన గుండె సడులలో,
నీవు మ్రొక్కిన రాములోరి గుడి,
ప్రక్కనే ఉన్న చిన్నప్పటి బడి
గుర్తుకు వచ్చాయా నీకు?
ఆ ఊరు చెప్పిన కతలు,
చిన్నప్పుడు కట్టిన జతలు
ఏనాడైనా నీ వెతలలో తలుచుకున్నావా?
నీ తల్లిని చూస్తావా,
ఆ పల్లెని పలకరిస్తావా,
కన్న తల్లి ఋణం తీర్చుకుంటావా?
ఏం మిగిలింది నేస్తం చివరికి,
కనులు చెమర్చే జ్ఞాపకాలు తప్ప?

Saturday, November 8, 2008

అపురూపం

ఈ అపురూపమైన వరాన్ని నేనేమని వర్ణించను? వర్ణించలేను అని అనడం నిజంగా నా అహంకారమే అవదా?
నేనేదో busyగా ఉన్నాననే భ్రమలో ఉంటూ, కనీసం అప్పుడప్పుడైనా మన గత ఙాపకాలను తలుచుకుంటూ, కొంచెం మురిసిపోవడమో లేదా నన్ను తిట్టుకోవడమో చేసే నీ గురించి అసలు పట్టించుకోని నాది అహంకారం కాదంటావా? కనీసం నీ birthday అయినా నాకు గుర్తుందా అని నీకు సందేహమొచ్చింది కదూ?
ఒక్కటి మాత్రం నిజం; అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ నేస్తమే లేకపోతే ఈ జీవితం, దానికో అర్ధము, గమ్యమును నిర్వచింపబడేవా అని?
నువ్వు, నీ అందమైన చిన్న ప్రపంచం (Sorry, పెద్ద ప్రపంచం), అందులో నాకో చిన్న స్థానం దక్కిందని ఆనందపడనా? నీ ప్రపంచం, నా ప్రపంచం, ఏదో వేళలో, ఏదో చోట కలిసి మరో ప్రపంచమవుతుందంటావా? మరో ప్రపంచం పిలుస్తుందంటావా? మరో ప్రపంచం పిలువకపోయినా మనం మన ప్రపంచాలతో సరిపెట్టుకుందాంలే!
నువ్వు పుణికిపుచ్చుకున్న ఆత్మస్థైర్యం, మనోనిబ్బరాలే ఆలంబముగా, నీకు ఎన్నో సముద్రాలకవతల అతి దూరంలో, నా ప్రపంచంలో, నేను!

Saturday, September 27, 2008

నీ గురుతు

కాలాన్ని తిరిగితోడమంటావా మిత్రమా,  
నీవన్న చెరిగిపోని గురుతుని వెలికితీయడానికి? 
పరుగులెడనీ కాలం, 
పెరిగిపోనీ దూరం, 
రాజ్యమేలనీ నిశ్శబ్ధం, 
కరిగిపోనీ కాయం, 
చెరిగిపోలేదు మిత్రమా నీ గురుతు! మరవలేనూ నేను నీ పరిచయం, కడగలేనూ నేను నీ ఙాపకాలను, విడవలేనూ నేను ఆ రోజులను! కాలాన్ని తిరిగితోడమంటావా మిత్రమా,
నీవన్న చెరిగిపోని గురుతుని వెలికితీయడానికి?